Breaking News : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం
X
కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రకటించింది. పార్టీ రాష్ట్ర నాయకులందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం పార్టీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. 7న ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెప్పారు. డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రేలు అందజేసిన రిపోర్టుతో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ తదితర సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారన్న దానిపై త్వరలో ప్రకటన చేస్తామని వేణుగోపాల్ స్పష్టం చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేయడమే తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు.మరోవైపు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. దీంతో ఆయన వెంటనే హస్తిన బయలుదేరి వెళ్లారు.