Home > తెలంగాణ > కాంగ్రెస్ కథ మార్చిన రేవంత్ రెడ్డి.. విన్నింగ్ టీమ్‌కి ఆయనే లీడర్

కాంగ్రెస్ కథ మార్చిన రేవంత్ రెడ్డి.. విన్నింగ్ టీమ్‌కి ఆయనే లీడర్

కాంగ్రెస్ కథ మార్చిన రేవంత్ రెడ్డి.. విన్నింగ్ టీమ్‌కి ఆయనే లీడర్
X

ప్రస్తుతం టి కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో విజయం సాధించేందుకు ఆ పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వ్యూహాలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి. ఇటీవల కర్నాటక గెలుపుతో వచ్చిన ఊపుని రాబోయో తెలంగాణ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది హస్తం పార్టీ. టి కాంగ్రెస్ లో రేవంత్ నాయకత్వంపై మొదటి నుంచి విభేదిస్తున్న వారి సంఖ్య గట్టిగానే ఉంది. సీనియర్ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి( Revanth Reddy )పై అడపా దడపా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పార్టీలో రేవంత్, సీనియర్స్ మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం బహిరంగ రహస్యమే. ఎన్నికల సమయానికి రేవంత్ నాయకత్వంపై ఆ నేతలు పెదవి విరిస్తే తెలంగాణలో పట్టు కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు కాంగ్రెస్ కేడర్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

పార్టీలో సమస్యలకు, గొడవలకు చెక్


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పార్టీ గెలుపే లక్ష్యంగా .. రాజకీయంగ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎవ్వరి అంచనాలకు అందకుండా... పక్కా ప్లాన్‌తో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గట్టిగానే కృషి చేస్తున్నారని పొలిటికల్ టాక్. కాంగ్రెస్‌లో కొట్లాటలు కామన్. వాళ్లు కలిసేదెప్పుడు.. ఆ పార్టీ గెలిచేదెప్పుడు అన్న అంచనాలను తలకిందులు చేస్తూ.. పార్టీనీ రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్న విధానం చూస్తుంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది. గాంధీ భవన్ ని వదిలి 40 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తుంటే.. మేమూ యాత్రలు చేస్తామని కొందరు నేతలు కాలడ్డు పెట్టారు. ఈ వివాదాన్ని సామరస్యంగానే రేవంత్ పరిష్కరించి ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చని ప్రకటించారు. తన నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించిన నేతలని రేవంత్ డీల్ చేసిన విధానంతో కాంగ్రెస్ పార్టీ కథ మారిందని హార్డ్ కోర్ అభిమానులు సంబరపడ్డారు.

అందరూ ఆహ్వానితులే..





ఆ తర్వాత కొన్నాళ్లకు మరో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మొదలు పెట్టేసరికి.. ఇది రేవంత్‌కు పోటీయాత్ర అని కొంతమంది సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. మీడియా ఇదే విషయాన్ని హైలెట్ చేయడంతో రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి.. ఇది పోటీయాత్ర కాదు, తామంతా కలిసే ఉన్నామని ప్రకటించారు. ఇంతే కాదు.. భట్టి ఎక్కడ మీటింగ్ పెట్టినా.. తానే అందులో పాల్గొంటానని చెప్పారు. భేషజాలకు పోకుండా చెప్పినట్లుగానే భట్టి బహిరంగ సభలకు రేవంత్ హాజరయ్యారు. దీంతో జనాల్లోకి కాంగ్రెస్ పార్టీపై ఒక పాజిటివ్ ఓపినియన్ ఏర్పడిందని రేవంత్ అభిమానులు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ లోపాలను ఎత్తి చూపుతూ.. తాము అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామో చెబుతూ భట్టి ప్రజల్లో తిరుగుతున్నారు. మరోవైపు పార్టీలోకి ఎవరెవర్ని జాయిన్ చేసుకోవాలి? జనాకర్షణ కలిగిన నేతలెవరు అనే దానిపై రేవంత్ కసరత్తు చేసుకుంటూ... పార్టీలోకి అందరూ ఆహ్వానితులే. తన ద్వారానే కాదు ఎవరి ద్వారానైనా కాంగ్రెస్ లో చేరొచ్చని ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. మొత్తం మీద జాయినింగ్స్ అన్నీ కాంగ్రెస్ లోకే అన్న అభిప్రాయం ప్రజలకు కలిగించడంలో సక్సెస్ అయ్యారు.

కేసీఆర్‌తో అంత ఈజీ కాదు




కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి రాజకీయ ఉద్దండులైన సిద్దరామయ్య , డీకే శివకుమార్ ల వంటి మాస్ లీడర్లు.. జోడెడ్లలాగా కలిసి పనిచేయడమే కారణం. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను చేధించడంలో తాము విఫలమయ్యామని బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై స్వయంగా ఒప్పుకున్నారు. కానీ తెలంగాణ కర్ణాటక కాదు.. కేసీఆర్ బసవరాజ్ కానే కాదన్న సంగతి రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. రాజకీయ చాణక్యుడు, దేశ రాజకీయాల్లోనే డిఫరెంట్ లీడర్ అయిన కేసీఆర్ ను ఎదుర్కొవడానికి.. పార్టీ మొత్తాన్ని ఒక్క తాటిపై ఉంచేలా రేవంత్ పనిచేస్తున్నారు.

అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్న రేవంత్




తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. గొంగళి పురుగునైనా ముద్దుపెట్టుకుంటానన్న కేసీఆర్ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. అందుకే ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా జనాదరణ ఉన్న నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు నుంచి జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, పొంగులేటితో పాటు మరో ఏడెనిమిది మంది ఎమ్మెల్యే స్థాయి లీడర్లు పార్టీలో చేరడానికి రెడీ అయ్యారని రేవంత్ వర్గం మీడియాకు లీకులిస్తుంది. వీరంతా ఈ నెల(జూన్) ఆఖరుకల్లా కాంగ్రెస్‌లో చేరుతారని చెబుతోంది. ఇక వచ్చే నెల(జులై)లో రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బడా నేతలు పార్టీలోకి వస్తున్నట్లు కాంగ్రెస్ లో టాక్ వినిపిస్తోంది. కరీంగనర్, వరంగల్ జిల్లాలకు చెందిన నేతలు సెప్టెంబర్‌లో.. 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్టోబర్ లో కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి ప్రిపేర్ అయ్యారని రేవంత్ రెడ్డి వర్గం ఢంకా బజాయించి చెబుతోంది. ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎంను డిసైడ్ చేసేది పార్టీ హై కమాండ్ అయినా కూడా విన్నింగ్ టీమ్ కి రేవంత్ రెడ్డే లీడర్ గా ఉంటారని ఆయన అభిమానులు ఫిక్స్ అయ్యారు.



Updated : 15 Jun 2023 2:37 PM IST
Tags:    
Next Story
Share it
Top