Home > తెలంగాణ > కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు..

కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు..

కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు..
X

వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. సీఎం కేసీఆర్, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ వరదల్లో కొట్టుకుపోయారని, ఉన్నా లేననట్టేనని అన్నారు. వారికి ప్రజల ప్రాణాలు పూచిక పుల్లతో సమానమని ధ్వజమెత్తారు. వరదలు, వర్షాలతో 30 మంది చనిపోయినా ఎందుకు పరామర్శించేందుకు లేదని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో కుక్కకు ఉన్న విలువ ప్రజల ప్రాణాలకు లేదా? అని దుయ్యబట్టారు.

‘‘వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఓ వైపు భారీ వ‌ర్షాల‌తో జ‌నం అత‌లాకుత‌లం అవుతుంటే ఒక‌రు ఫామ్ హౌస్‌లో, మ‌రొక‌రు విందులు వినోదాల‌లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది. సీఎం, మునిసిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం అన్న‌ది ఉందా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ భూమి మీద ఉన్నా లేన‌ట్టే. అందుకే వారు లేర‌ని ఇప్ప‌టికే ప్ర‌జ‌లు డిసైడ్ అయ్యారు. సోమవారం ఆ ఇద్ద‌రు తండ్రీ కొడుకుల‌కు త‌ద్దినం పెట్టాల‌ని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణుల‌కు పిలుపునిస్తున్నా’’ అని రేవంత్ అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా వరద సహాయక చర్యలపై ప్రణాళికాబద్ధంగా పనిచేయడం లేదని విమర్శించారు. ‘‘తాజా వరదల్లో 3 వేల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలి. వరదల్లో నష్టపోయిన వారికి తాత్కాలిక నష్ట పరిహారంగా రూ.15 వేలు ఇవ్వాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ శనివారం తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉప్పల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో పర్యటించారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ బర్త్ డే పార్టీల్లో మునిగిపోయారు మున్సిపల్ శాఖ మంత్రిని ఉరేసినా తప్పు లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజాం కాలం నాటి చెరువులను 90 శాతం మంది బీఆరెస్ నేతలు ఆక్రమించుకున్నారని, చెరువుల ఆక్రమనలతో కాలనీలు వరదల్లో మునిగిపోయాయి అని ఆరోపించారు. కేటీఆర్ కు విలాసాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.


Updated : 29 July 2023 3:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top