Home > తెలంగాణ > ఆంధ్రావాళ్ల డబ్బుతో కేసీఆర్ పార్టీ పెట్టారు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రావాళ్ల డబ్బుతో కేసీఆర్ పార్టీ పెట్టారు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రావాళ్ల డబ్బుతో కేసీఆర్ పార్టీ పెట్టారు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోసం ఆనాడు చంద్రబాబు చెప్పులను కేసీఆర్ మోశారని ఆరోపించారు. చంద్రబాబు అపాయింటుమెంట్ కావాలంటే..వేమూరి రాధాకృష్ణ సహా పలువురి ప్రముఖులను కేసీఆర్ బతిమాలాడేవారని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్ లో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌లు రాజకీయాలు మాట్లాడటంపై కూడా విమర్శలు గుప్పించారు. విద్యుత్ విషయంలో తెలంగాణ మంత్రులు వితండవాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్, పోచారం, గుత్తాలు కారణమన్న ఆయన టీడీపీలో కేసీఆరే రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఆంధ్రావాళ్ల డబ్బుతో పార్టీ..

2009కి ముందు టీడీపీని వ్యతిరేకించిన కేసీఆర్ తర్వాత అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని గుర్తుచేశారు. అప్పుడే కేటీఆర్ టీడీపీ సహకారంతో సిరిసిల్లలో కేవలం 150 ఓట్ల మెజార్టీతో గెలిచారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ దయతో బతికిన కేసీఆర్.. ఇప్పుడు అదే పార్టీలను తిడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నేత బొజ్జల గోపాలకృష్ణరెడ్డి ఆర్థిక సాయంతోనే కేసీఆర్ పార్టీ పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు.

దమ్ముంటే గజ్వేల్‌లో పోటీ చేయాలి..

కేసీఆర్ కు దమ్ముంటే గజ్వేల్ నుండి పోటీ చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌ను ఓడించేందుకు తాను అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాలన్నారు. కేసీఆర్ ఎక్కడి నుండి పోటీ చేస్తే తాను అక్కడి నుండి సిద్ధమని బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్పారని, ఆయన పోటీ చేస్తారా? చేయరా చెప్పలన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుండి పోటీ చేస్తే గెలుస్తానో కేసీఆర్ సర్వేలు చేయించుకుంటున్నారని, కానీ గజ్వేల్ నుండే పోటీ చేసి, సత్తా నిరూపించుకోవాలన్నారు.

పోచారం, గుత్తాలపై ఫైర్

శాసన సభ స్పీకర్ పోచారం, కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డిలు రాజకీయాలు మాట్లాడడంప రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొడుకు అక్రమ దందాలు, కేసుల నుండి తప్పించుకోవడానికి స్పీకర్ గా ఉండి కేసీఆర్ బూట్లు నాకుతున్నారని ధ్వజమెత్తారు. అదేవిధంగా కొడుకుకు టిక్కెట్ కోసం కౌన్సిల్ చైర్మన్ పదవిని సుఖేందర్ రెడ్డి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. పోచారం, గుత్తాలను రైతు కులం నుండి బహిష్కరించాలని, గవర్నర్ వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Updated : 15 July 2023 2:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top