Home > తెలంగాణ > మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో గద్దర్ అంత్యక్రియలు.. అక్కడే ఎందుకంటే..?

మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో గద్దర్ అంత్యక్రియలు.. అక్కడే ఎందుకంటే..?

మహాబోధి స్కూల్ గ్రౌండ్‌లో గద్దర్ అంత్యక్రియలు.. అక్కడే ఎందుకంటే..?
X

గతకొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజా గాయకుడు గద్దర్‌ (74) ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరిన గద్దర్‌ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈనెల 3న డాక్టర్లు బైపాస్‌ సర్జరీ చేయగా.. కోలుకున్నట్లు కనిపించారు. అయితే, ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు.

గద్దర్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జీవితాంతం ప్ర‌జ‌ల కోసం గద్దర్ చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుకు త‌గిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఇక గద్దర్ అంత్యక్రియలు అల్వాల్‌లోని మహాబోధి అనే స్కూల్‌లో జరుగనున్నాయి. నర్సరీ నుంచి పదో తరగతి వరకు పేద విద్యార్థులకు విద్యానందించాలనే లక్ష్యంతో గద్దర్ మహాబోధి పాఠశాలను ఏర్పాటు చేశారని సిబ్బంది తెలిపారు. గద్దర్​కు అత్యంత ఇష్టమైన ఈ పాఠశాలలోనే అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ స్కూల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను మేడ్చల్‌ డీసీపీ శబరీష్‌ పరిశీలించారు.

ప్రస్తుతం ఎల్బీస్టేడియంలో గద్దర్‌ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. పెద్ద సంఖ్యలో నేతలు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు ఉదయం11:30 గం.లకు ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ భూదేవి నగర్‌లోని గద్దర్ నివాసం వరకు అంతిమయాత్ర నిర్వమించనున్నారు. ఇంటివద్ద ప్రజల కోసం కొద్దిసేపు పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తరువాత అల్వాల్‌లోని మహాబోధి పాఠశాలకు తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది గద్దర్​తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


Updated : 7 Aug 2023 11:26 AM IST
Tags:    
Next Story
Share it
Top