Home > తెలంగాణ > రికార్డు సృష్టించబోతున్న నిమ్స్ ఆస్పత్రి.. దేశంలోనే తొలిసారి

రికార్డు సృష్టించబోతున్న నిమ్స్ ఆస్పత్రి.. దేశంలోనే తొలిసారి

అందుబాటులోకి రోబోటిక్‌ సర్జరీలు

రికార్డు సృష్టించబోతున్న నిమ్స్ ఆస్పత్రి.. దేశంలోనే తొలిసారి
X



ప్రభుత్వ నిమ్స్ ఆస్పత్రి సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఈ సర్కారీ దవాఖానాలో నేటి నుంచి రోబోటిక్‌ సర్జరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో రోబోటిక్‌ సర్జరీ సేవలందించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. నిమ్స్‌లో రోబోటిక్‌ వైద్య సేవల కోసం కేసీఆర్ సర్కార్ 31.5 కోట్లతో డావెన్సీ ఎక్స్‌ఐ రోబోను కొనుగోలు చేసింది. రూ.16.5 కోట్లతో సర్జికల్‌ న్యూరో, సర్జికల్‌ యూరాలజీ విభాగాలకు చెందిన అత్యాధునిక వైద్య పరికరాలను కూడా సమకూర్చింది. వీటిని సోమవారం వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.




రోబోటిక్ సర్జరీల ద్వారా ఎలాంటి కోత లేకుండానే చిన్నపాటి రంధ్రం ద్వారా ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చని నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప వెల్లడించారు. పొట్ట, ఛాతి, రెక్టమ్‌ కెనాల్‌, కాలేయం తదితర అవయవాల్లో ఎంతటి క్లిష్టమైన సర్జరీలనైనా సులభంగా చేయవచ్చని చెప్పారు. రోబోకు ఉన్న చేతులు 360 డిగ్రీలు తిరగగలవని, తద్వారా మనిషి వేళ్లు వెళ్లలేని ప్రాంతంలోనూ సర్జరీ చేసేందుకు వీలుంటుందని, అదీ తక్కువ సమయంలోనేనని వివరించారు. ఈ రోబో సేవలను ప్రస్తుతానికి సర్జికల్‌ గ్యాస్ట్రో, సర్జికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ యూరాలజీ విభాగాల్లో సర్జరీలు చేయనున్నట్టు తెలిపారు.

ఈ సర్జరీల ద్వారా పేషెంట్లకు ఎలాంటి కోత లేనందున కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు, నొప్పి పెద్దగా ఉండదు. సర్జరీ సమయంలో బ్లీడింగ్ కూడా ఉండదు. సర్జరీ జరిగిన రెండు, మూడో రోజే పేషెంట్లు ఇంటికి వెళ్లవచ్చు. ఇలాంటి సర్జరీల వల్ల ఖర్చు తగ్గుతుంది.




Updated : 3 July 2023 7:30 AM IST
Tags:    
Next Story
Share it
Top