కోనప్ప ఇలాకా నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ
X
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బహుజన్ సమాజ్ పార్టీకి కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన బీఎస్పీ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది. కాగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. సిర్పూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ కండువా కప్పుకున్నప్పటి నుంచి ఆర్ఎస్పీ సిర్పూర్ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మండలాలన్ని తిరుగుతూ, ప్రజలతో మమేకమయ్యారు. నియోజక వర్గ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రభుత్వ పని తీరును ఎండగట్టారు. తాజాగా ‘పల్లెపల్లెకు బీఎస్పీ- ప్రగతిభవన్‌కు ఆర్‌ఎస్‌పీ’ కార్యక్రమాన్ని చేపట్టి పలు జిల్లాల్లో పర్యటించారు. ఇదే సమయంలో ఇటీవల బెజ్జూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన భారీ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. సిర్పూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. దీంతో రాష్ట్రంలో సిర్పూర్ పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పట్టున్న ఆర్ఎస్పీ.. ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి కారణం ఏంటని చర్చలు నడిచాయి. దానితో పాటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కంచుకోటగా ఉన్న సిర్పూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి.. గెలవగలడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే పక్కా లెక్కలతోనే ఆర్ఎస్పీ అడుగులు వేస్తున్నారని బీఎస్పీ శ్రేణులు అంటున్న మాట. చాలాకాలం నుంచి సిర్పూర్ నియోజక వర్గంలో విస్త్రుతంగా పర్యటించిన ఆర్ఎస్పీ.. ఎమ్మెల్యే కోనప్ప, ఆయన అనుచరులు, కాంట్రాక్టర్లు, కబ్జాదారులపై గళం విప్పారు. వాళ్ల అక్రమాలు, దోపిడిపై ప్రశ్నించారు. దీంతో అక్కడి గిరిజనుల్లో చైతన్యం వచ్చి ఆర్ఎస్పీని సిర్పూర్ నుంచి పోటీ చేయాలని, తప్పకుండా గెలిపిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై బీఎస్పీ అధినేత్రి మాయావతితో చర్చించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే దందాలు, దోపిడిల నుంచి ప్రజలను కాపాడి వారి ఆకాంక్షలు నెరవేస్తామని చెప్పుకొచ్చారు.
బీఎస్పీకి బలముందా?
సిర్పూర్ నుంచి పోటీ చేయడానికి ఆర్ఎస్పీ ఆసక్తి చూపడానికి పలు ప్రధాన కారణాలు ఉన్నాయి. జనరల్ స్థానమైన సిర్పూర్ నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచారు. 2009లో పోటీ చేసి కావేటి సమ్మయ్య చేతిలో ఓడిపోయారు. తర్వాత 2014లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన కోనప్ప అనూహ్యంగా గెలుపొందారు. ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు. 2014 ఎన్నికల నుంచి బీఎస్పీ (ఏనుగు గుర్తు) సిర్పూర్ నియోజక వర్గ ప్రజలకు సుపరిచితం అయింది. సిర్పూర్ లో ఎస్సీ ఓటు బ్యాంకు ఎక్కువ. అంతేకాకుండా స్థానికంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్లు ఉన్నారు. వీళ్లలో ఎక్కువ బహుజన వాదాన్ని విశ్వసించేవారే. దీంతో పార్టీకి మేలు జరుగుతుందని, ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీ విశ్వసిస్తోంది. దీంతో పాటు సిర్పూర్ నియోజక వర్గంలో ఎక్కువగా ఆదివాసీ, గిరిజనులు ఉన్నారు. బీసీలకు అండగా ఉంటూ.. వారి ఓట్లపై కూడా బీఎస్పీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు మీటింగ్స్ పెట్టి ఎమ్మెల్యే అవినీతిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఆర్ఎస్పీ. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు కూడా తోడయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి బీఎస్పీ గట్టిపోటీ ఇస్తుందా లేదా చూడాలి.