బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ.. ఆర్ఎస్ ప్రవీణ్ ఏమన్నారంటే..?
X
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కాంగ్రెస్ ఒక్కో హామీని అమలుచేస్తోంది. ఇందులో భాగంగా ముందుగా ఆరోగ్యశ్రీని 10లక్షలకు పెంచడం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి అమల్లోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఇప్పుడిప్పుడే నష్టాల్లోనుండి బయటికొస్తున్న ఆర్టీసీ మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు పెను భారాన్ని మోపబోతోందని విమర్శించారు.
‘‘కాంగ్రెస్ నిర్ణయం దాదాపుగా 50 వేల మంది ఆర్టీసి కార్మికుల జీవితాల మీద కూడా ప్రభావం చూపబోతున్నది. అంతేకాకుండా తెలంగాణ వచ్చినప్పటినుండి రకరకాల కారణాల వల్ల చాలా గ్రామాలకు ఆర్టీసి బస్సులు బందుపెట్టిండ్రు. ఇప్పుడు మళ్లీ ఆ సర్వీసులను పునరుద్దరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. అదేవిధంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు తమకు తగినంత ప్యాసింజర్లు దొరకక రోడ్ల మీద పడతామేమోనని భయపడుతున్నారు. ఊర్లల్లో తగిన పని దొరకక పట్టణాలకు వలస వెళ్లి రేకుల షెడ్లలో ఉంటూ కిరాయి ఆటోలను నడుపుతూ పొట్టగడుపుకుంటున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి’’ అని ఆర్ఎస్పీ అన్నారు.