బీఆర్ఎస్ చేసిన తప్పులు కాంగ్రెస్ చేయొద్దు : RS Praveen Kumar
X
తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ అప్పులతో ప్రజాధనాన్ని లూటీ చేసిందని.. సీఎం రేవంత్ రెడ్డి ఆ తప్పులను మళ్లీ చేయొద్దని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. సూర్యాపేటలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓటమికి గల కారణాలపై చర్చించారు. లోటుపాట్లను సరిదిద్దుకొని పార్టీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఫలితాలతో పార్టీ క్యాడర్ ధైర్యం కోల్పోవద్దన్న ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులే అయ్యింది కాబట్టి.. ఇప్పుడే ఎటువంటి విమర్శలు చేయడం మంచిది కాదని ఆర్ఎస్పీ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన నిరంతరం పోరాడుదామన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని అడ్డగోలుగా లూటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే భవిష్యత్లో కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు. అనంతరం సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.