Home > తెలంగాణ > Gas Cylinder: రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌.. అందరికీ కాదు

Gas Cylinder: రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌.. అందరికీ కాదు

రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకం వారికి వర్తించదు

Gas Cylinder: రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌.. అందరికీ కాదు
X


ఎన్నికల సమయంలో హస్తం పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో రెండు గ్యారంటీల అమలుకు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. మేడారం మహాజాతర వేదికగా ఈనెల 27న రూ.500 కే గ్యాస్ సిలిండర్‌, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాలను అమలు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలవుతుండగా.. మరో రెండు గ్యారంటీలను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పక్కన పెడితే ఈ పథకాలనుపూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందించరని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 500 రూపాయల సిలిండర్​ పథకంపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉంటే, ప్రభుత్వం మాత్రం కేవలం 40 లక్షల మందికి మాత్రమే ఈ పథకానికి అర్హులుగా పరిగణించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నాయి. అదీ కాకుండా గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడే ఎజెన్సీలకు మొత్తం ధర (ప్రస్తుతం రూ. 955) ఎందుకు చెల్లించాలని నిలదీస్తున్నాయి. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా నేరుగా రూ.500 కే సిలిండర్ ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి.. ముందే మొత్తం డబ్బులు కట్టించుకొని మళ్లీ రీఎంబర్స్ చేయడం సబబు కాదంటున్నాయి. సంవత్సరానికి మూడు నుంచి ఐదు సిలిండర్లు మాత్రమే ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అనడం కరెక్ట్ కాదని ఆరోపిస్తున్నాయి.




ఇక కొత్తగా తీసుకునే గ్యాస్‌ కనెక్షన్లకు రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకం వర్తించదని పౌరసరఫరాల శాఖ ఇప్పటికే వెల్లడించింది. పాత కనెక్షన్లలో రేషన్ కార్డులున్నవారికీ.. అది కూడా వాడకంలో ఉన్న సిలిండర్లకే రాష్ట్ర ప్రభుత్వ గ్యాస్‌ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపింది. ప్రజా పాలన వచ్చిన దరఖాస్తులు పరిశీలించిన ప్రభుత్వ అధికారులు.. ఆధార్, రేషన్ కార్డులతో సరిచేసి చూశారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేని వాటిని పక్కన పడేసి, లబ్ధిదారులు మూడేండ్లలో ఏడాదికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో.. ఆ ప్రకారమే సగటు ఆధారంగా రాయితీ సిలిండర్ల సంఖ్య ఖరారు చేయనున్నారు. ప్రజా పాలనలో తప్పనిసరిగా గ్యాస్‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలనే నిబంధన కూడా తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే రాయితీ చెల్లింపులకు ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ప్లాట్‌ఫాంగా పనిచేస్తుందని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఎస్‌బీఐ నోడల్‌ బ్యాంకుగా వ్యవహరిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అప్‌ఫ్రంట్‌ అమౌంట్‌ బ్యాంకులో ఉంటుందని చెప్పారు. రాయితీ సిలిండర్లు సరఫరా చేశాక ఎన్‌పీసీఐ నోడల్‌ బ్యాంకులో ఉన్న సొమ్ము నుంచి లబ్ధిదారుల ఖాతాలకు నిర్ణీత సబ్సిడీని బదిలీ చేస్తుందని వెల్లడించారు.



Updated : 25 Feb 2024 7:06 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top