మహిళలకు TSRTS బస్సుల్లో ఉచిత ప్రయాణం.. నేడు మార్గదర్శకాలు
X
రాష్ట్ర మహిళలకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రేవంత్ రెడ్డి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. రేపటి(శనివారం) నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. బస్సుల్లో కండక్టర్‌లకు ఆధార్ కార్డును చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. శుక్రవారం సంబంధిత శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సమావేశానంతరం తుది మార్గదర్శకాలు ఖరారు కానున్నాయి. ఏఏ బస్సుల్లో మహిళలను అనుమతిస్తారు, ప్రయాణ పరిధి ఎంత, ప్రయాణించే వారు ఏఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది తదితరాలను ఈనాటి మార్గదర్శకాల్లో వెల్లడిస్తారు.
ఈ పథకం ఇప్పటికే కర్ణాటకలో అమలవుతుండగా.. టీఎస్ఆర్టీసీ అధికారుల బృందం గురువారం హుటాహుటిన కర్ణాటకకు వెళ్లింది. ఈ పథకం కోసం ఎంత ఖర్చు అవుతున్నది? దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తున్నది? వంటి విషయాలను పరిశీలించి రిపోర్ట్ ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఆ రిపోర్ట్ ను ఈ రోజు సీఎంకు అందజేసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. కర్ణాటకలో మొత్తం 22 వేల పైచిలుకు బస్సులుండగా... తెలంగాణలో బస్సుల సంఖ్య 8,571గా ఉంది. పథకం అమలుకు ముందు కర్ణాటకల బస్సుల్లో ప్రయాణించే ఆ రాష్ట్ర మహిళల సంఖ్య 40-41 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 55 శాతం మహిళలు ప్రయాణిస్తున్నారు. ఈ పథకాన్ని కేవలం ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే అమలు చేస్తున్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై నేడు సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ కానుండగా.. తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏయే బస్సుల్లో అమలు చేయాలనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. టీఎస్ఆర్టీసీ ప్రతీరోజూ 12-13 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని నడుపుతోంది. సగటున రోజుకు రూ.14 కోట్ల రాబడి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది (12-13 లక్షల మంది) మహిళలు ఉంటున్నారు. ఉచిత ప్రయాణ పథకం అమలుతో రోజుకు సుమారు రూ.నాలుగు కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుందని ఎండీ సజ్జనార్ అన్నారు.