Home > తెలంగాణ > TG :పాత వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చుకోవాల్సిందేనా..? క్లారిటీ ఇదే..

TG :పాత వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చుకోవాల్సిందేనా..? క్లారిటీ ఇదే..

TG :పాత వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చుకోవాల్సిందేనా..? క్లారిటీ ఇదే..
X

రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చట్టం తీసుకురానున్నట్లు ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై జనాల్లో సందిగ్దం నెలకొంది. పాత వాహనాలకు సైతం నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌లో తెలంగాణకు TGగానే అఫ్రూవల్ ఇచ్చింది. అయితే కేసీఆర్ మాత్రం కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ను కాదని TSగా పేరు మార్చారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను TGగా మార్చాలని నిర్ణయించింది. వెహికల్ రిజిస్ట్రేషన్లతో పాటు ఏదైనా ఇకపై టీఎస్ బదులుగా TGగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలోనూ రాష్ట్ర పేరును TG అని పిలిచేవారు. అప్పట్లో నిరసనల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై ఏపీ స్థానంలో టీజీ అనే రాశారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వెహికిల్ రిజిస్ట్రేషన్, నేమ్ బోర్డుల్లో TGనే ఉపయోగిస్తారని అంతా భావించారు. కానీ కేసీఆర్ సర్కారు మాత్రం ఎవరూ ఊహించని విధంగా టీఎస్ అని రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ నిర్ణయంపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో 'టీజీ' అంటే తెలంగాణ అనే పదాన్ని రెండుగా విభజించినట్టవుతుందని.. అది ఒకటే పదంగా ఉంచేందుకే తెలంగాణ స్టేట్ అని వచ్చేలా 'టీఎస్‌' అనే అక్షరాలను రిజిస్టర్ చేపించినట్టు వివరణ ఇచ్చింది.

ఇదిలా ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్లను టీఎస్గా మార్చుకోవాలా లేదా అన్న సందిగ్దం నెలకొంది. ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తూ అప్పట్లో రవాణా శాఖ క్లారిటీ ఇచ్చింది. పాత వాహనాలు ఏపీ పేరుతోనే కొనసాగుతాయని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే వెహికిల్స్ కు మాత్రం టీఎస్ పేరుతో నెంబర్ ప్లేట్ వస్తుందని స్పష్టం చేశారు. తాజాగా టీఎస్ నుంచి టీజీకి మారనుండటంతో ప్రజల్లో మరోసారి సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీఓ శాఖ మళ్లీ స్పష్టత ఇచ్చింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చేంత వరకు టీఎస్ కొనసాగుతుందని, ఆ తర్వాత టీజీ అమల్లోకి వచ్చినా పాత వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన అవసరంలేదని క్లారిటీ ఇచ్చింది. నెంబర్ ప్లేట్ల మార్పుతో ఆర్టీఓపై పనిభారం పెరగడంతో పాటు ప్రజలకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.




Updated : 5 Feb 2024 3:31 PM IST
Tags:    
Next Story
Share it
Top