ఒకేసారి కాటేసిన రెండు పాములు..3 ఏళ్ల బాలుడు మృతి
X
ఒకేసారి రెండు పాములు కాటేసి ఓ మూడేళ్ల బాలుడిని బలిగొన్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. బినోలుకు చెందిన భూమయ్య, హర్షిత దంపతులకు మూడుళ్ల బాలుడు రుద్రాన్ష్, మూడు నెలల పాప ఉన్నారు. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు వారు ఉంటున్న ఇంట్లోని ఓ గది కుప్పకూలిపోయింది. దీంతో ఇంట్లోని మరో గదిలో వీరంతా ఉంటున్నారు. శుక్రవారం రాత్రి రోజూ లాగే అందరూ అదే గదిలో పడుకున్నారు. ఈ క్రమంలోనే రెండు పాములు ఇంట్లోకి దూరి రుద్రాన్ష్ను కాటేశాయి. బాలుడు ఉలిక్కిపడి ఏడ్వడంతో అక్కడి నుంచి వెళుతున్న రెండు పాములను తండ్రి గుర్తించాడు. వెంటనే వాటిని చంపి బాలుడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శనివారం మరణించాడు. చిన్నారి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని తల్లిదండ్రలు కన్నీరుమున్నీరవుతున్నారు.