మియాపూర్లో దారుణం.. నాటు తుపాకీతో హోటల్ మేనేజర్పై కాల్పులు
X
మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. మదీనాగూడలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి ఓ వ్యక్తి ప్రాణం తీశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
కోల్‌కతాకు చెందిన దేవేందర్ గాయన్(35) 6 నెలల నుంచి మదీనగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. సుచిత్ర ప్రాంతంలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి డ్యూటీ ముగించుకుని హోటల్ నుంచి బయటకు వచ్చారు. ఇంటికెళ్లేందుకు సిద్ధమవుతుండగా హోటల్ ముందు స్నేహితుడు కనిపించడంతో మాట్లాడుతున్నారు. ఇంతలో మదీనాగూడ వైపు నుంచి బైక్ పై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నాటు తుపాకీతో దేవేందర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
నిందితుడు మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరపగా..నాలుగు బుల్లెట్లు దేవేందర్ శరీరంలోకి దూసుకుపోయాయి. కాల్పుల అనంతరం నిందితుడు చందానగర్ వైపు పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న దేవేందర్ ను స్థానికులు దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా అంతలోపే చనిపోయాడు. కాల్పుల ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దేవేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దేవేందర్ కుటుంబ నేపథ్యం సహా వివిధ అంశాలు ఆరా తీస్తున్నారు. దేవేందర్‌పై దాడి చేసిన నిందితుడు హోటల్ వద్ద రెక్కి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ హోటల్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.