మెడికల్ కాలేజీల్లో రెండో రోజూ ఈడీ సోదాలు
X
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో వరుసగా రెండో రోజు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు.. ఈరోజు కూడా హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లోని కాలేజీల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేసి అధిక డబ్బులకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో ఈడీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరిల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని కామినేనిలో ఈడీ సోదాలు ముగిశాయి.
బుధవారం ఉదయం హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ తదితర ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలతోపాటు నిర్వాహకుల ఆఫీసులు, ఇళ్లల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో మల్లారెడ్డి, కామినేని, మెడిసిటీ, ప్రతిమ సంస్థ కార్పొరేట్ కార్యాలయం, కరీంనగర్‌లోని ప్రతిమ, మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్, నల్గొండలోని కామినేని, ఖమ్మంలోని మమత, రంగారెడ్డిలోని పట్నం మహేందర్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీల్లో ఈ సోదాలు జరిగాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల నిర్వాహకులు పీజీ సీట్లను ప్రణాళిక ప్రకారం బ్లాక్ చేసి.. భారీ మొత్తానికి విక్రయించారంటూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు.. గతేడాది ఏప్రిల్‌లో వరంగల్ కమిషనరేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మట్టేవాడ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే తాజాగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.