హైదరాబాద్లో ఉత్కంఠ.. 144 సెక్షన్ అమలు
X
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఆదివారం (డిసెంబర్ 3) రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరచారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసులు, బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించారు.
స్ట్రాంగ్ రూం పరిసర ప్రాంతాల్లో144 సెక్షన్ అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా 144 సెక్షన్ విధించారు. మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు కానున్నాయి. దీనికి సంబంధించి 3 కమిషరేటర్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్లు, పబ్లిక్ ప్లేసెస్‌లో ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడదని తెలిపారు. పబ్లిక్ ప్లేసెస్, రోడ్లపై టపాసులు కాల్చకూడదని సూచించారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.