కేటీఆర్ కామెంట్స్ను తిప్పికొట్టిన మంత్రి సీతక్క
X
కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తిప్పికొట్టారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని ఆరోపించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీతక్క.. బీఆర్ఎస్ నేతలకు తొందర పడొద్దన్నారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ సాధ్యం కాని హామీలిచ్చిందని బీఆర్ఎస్ నేతలంటున్నారు. తమ పార్టీ ప్రకటించిన హామీలనే పెంచి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది కదా. మేం మహిళలకు రూ.2500 ఇస్తామంటే వాళ్లు రూ.3వేలన్నారు. మేం రూ.4వేల పెన్షన్ అంటే వాళ్లు రూ.5వేల పెన్షన్ అన్నారు. మావి అమలు కాని హామీలైతే మరి వాళ్లు ఇచ్చినవి ఏంటి? అప్పుడు వారికెలా సాధ్యమయ్యేద’ని సీతక్క ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని తప్పక అమలు చేసితీరుతుందని స్పష్టం చేశారు. రానున్న 1000 రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేసుకుంటూ వస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ గెలిచిందని ప్రజలంతా సంతోష పడుతున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.