Home > తెలంగాణ > Seethakka : బీఆర్ఎస్ ఓర్వలేకే ఆటోడ్రైవర్లతో ధర్నా చేయిస్తుంది: మంత్రి సీతక్క

Seethakka : బీఆర్ఎస్ ఓర్వలేకే ఆటోడ్రైవర్లతో ధర్నా చేయిస్తుంది: మంత్రి సీతక్క

Seethakka : బీఆర్ఎస్ ఓర్వలేకే ఆటోడ్రైవర్లతో ధర్నా చేయిస్తుంది: మంత్రి సీతక్క
X

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబంలో ఐదు ఉద్యోగాలు పోయాయని, రాష్ట్రంలో వారి ఆటలు సాగడం ఆగిందని మంత్రి సీతక్క ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్ లో పార్లమెంట్ ఎన్నికలపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క.. బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. ఆదిలాబాద్ అక్షర క్రమంలో ముందు ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం చాలా వెనకబడి ఉందన్నారు. సరస్వతీదేవి కొలువైన ప్రాంతం.. మహనీయులు పుట్టిన ప్రాంతమైన ఆదిలాబాద్ లో అభివృద్ధిని విస్మరించారన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పుకొచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారుల సూచించారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు కూడా ప్రజలలో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని సీతక్క సూచించారు. మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఓర్వలేక ఆటో డ్రైవర్లతో ఆందోళనలు చేయిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే బీఆర్ఎస్ తమపై విమర్శలు చేయడం మొదలుపెట్టిందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ కుటుంబం పదవులను అనుభవించిందని మండిపడ్డారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సీతక్క పిలుపునిచ్చారు.




Updated : 10 Jan 2024 11:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top