డీఎస్ ఆరోగ్యం విషమం.. ఐసీయూలో కొనసాగుతున్న చికిత్స
X
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు ఆయన శరీరంలోని అవయవాలు పనిచేయడం లేదని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు.
డీఎస్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. డీఎస్ ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. ఇప్పటికే సిటి న్యూరో ఆస్పత్రికి భారీగా అభిమానులు తరలివచ్చారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్‌కు గతంలో బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వచ్చింది. ఈ ఏడాది మార్చిలో తీవ్ర అనారోగ్యం పాలవడంతో ఆయనను సిటీ న్యూరో సెంటర్‌లో చేర్పించారు. మెరుగైన చికిత్స అందడంతో ఆయన కోలుకున్నారు. తాజాగా డీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.