డ్రగ్స్ పట్టివేతలో ఎస్సై చేతివాటం.. అరెస్ట్ చేసిన అధికారులు
X
డ్రగ్స్ పట్టివేతలో ఓ ఎస్సై చేతివాటం ప్రదర్శించాడు. ఓ ఆపరేషన్ లో దొరికిన డ్రగ్స్ ను కోర్టులో ప్రవేశ పెట్టకుండా... తన ఇంట్లో దాచుకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఆయనను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఇటీవల మహారాష్ట్రలో పోలీసులు చేపట్టిన ఓ ఆపరేషన్ లో ఎస్ఐ రాజేందర్ పాల్గొన్నారు. ఈక్రమంలోనే పట్టుబడిన డ్రగ్స్ ను కోర్టులో ప్రవేశ పెట్టకుండా.. ఎస్ఐ రాజేందర్ తన ఇంట్లో దాచి పెట్టాడు. ఈ విషయంపై నార్కోటిక్ విభాగం అధికారులకు పక్కా సమాచారం అందండంతో సదరు ఎస్ఐ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగానే రాజేందర్ ఇంట్లో డ్రగ్స్ దొరికాయి. అతడిని ఇంట్లోనే పట్టుకున్నారు.
ఆ తర్వాత నార్కోటిక్ విభాగం అధికారులు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) డైరెక్టర్, సీపీ సీవీ ఆనంద్‌కు నివేదిక ఇచ్చారు. అనంతరం నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించడంతో వారు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన రాయదుర్గం ఎస్సైగా పనిచేసినప్పుడు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అప్పట్లో అతడిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆ ఉత్వర్వులపై కోర్టు నుంచి రాజేందర్ స్టే తెచ్చుకున్నారు. ఈ తర్వాత సైబరాబాద్ సీసీఎస్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్నారు.