Home > తెలంగాణ > గద్దర్‌కు ఫ్రెండ్ మాత్రమే కాదు, అంతకు మించి.. ‘సియాసత్’ జహీరుద్దీన్ ఆదర్శ జీవితం

గద్దర్‌కు ఫ్రెండ్ మాత్రమే కాదు, అంతకు మించి.. ‘సియాసత్’ జహీరుద్దీన్ ఆదర్శ జీవితం

గద్దర్‌కు ఫ్రెండ్ మాత్రమే కాదు, అంతకు మించి.. ‘సియాసత్’ జహీరుద్దీన్ ఆదర్శ జీవితం
X

ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వెలువడే ప్రముఖ ఉర్దూ దినపత్రిక ‘సియాసత్’ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్.. తన ప్రాణమిత్రుడైన గద్దర్‌ను కడసారి చూడటానికి వెళ్లి గుండెపోటుతో కన్నుమూశారు. అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన ఆకస్మిక గుండెపోటుకు గురయ్యారు. సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు..

తొలినుంచీ సమాజం కోసం..

జహీరుద్దీన్ అలీఖాన్ విద్యార్థి దశ నుంచే పలు ప్రజాస్వామిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆరుపదులు దాటిన వయసులోనూ ఎక్కడ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటే అక్కడికి వెళ్లి పరిష్కారం కోసం కృషి చేసేవారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ముస్లిం సమాజం నుంచి మద్దతు కూడగట్టారు. మైనారిటీల హక్కుల కోసం భావసారూప్యం ఉన్న అన్ని పార్టీలతోనూ కలసి పనిచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జహీరుద్దీన్ సున్నిత మనస్కుడని, హైదరాబాద్‌లో మతసామరస్యం కోసం ఎంతో కృషి చేశారని మిత్రులు స్మరించుకుంటున్నారు. తెలంగాణ సమస్యల గురించి, ముస్లింల అభివృద్ధి గురించి జహీరుద్దీన్ ఉర్దూలో అనేక వ్యాసాలు రాశారు. ముస్లిం సమాజం ఏకాకిగా మిగలకుండా అన్ని వర్గాలతో కలసి మెలసి, ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించేవారు. మూఢనమ్మకాలను, మతఛాందసాన్ని నిరసించేవాడు. గద్దర్‌లాంటి విప్లవకారులతోపాటు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించేవారికి ఆయన ఆప్తమిత్రుడని మిత్రులు కొనియాడుతున్నారు.

జహీరుద్దీన్ చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేశారు. తర్వాత జర్నలిజంలోకి ప్రవేశించి 35 సంవత్సరాలుగా రిపోర్టింగ్, పత్రికా నిర్వహణ తదితర విభాగాల్లో పనిచేశారు. సియాసత్ మేనేజింగ్ డైరెక్టర్ జహీద్ అలీఖాన్‌కు ఆయన బంధువు. ఆయన తమ్ముడు డాక్టర్ మజర్ అలీ ఖాన్ ఇటీవలే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదమ్ములు కొన్ని నెలల వ్యవధిలోనే చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.



Updated : 7 Aug 2023 8:52 PM IST
Tags:    
Next Story
Share it
Top