Home > తెలంగాణ > Lasya Nanditha: ఎమ్మెల్యేగా గెలిచాక లాస్య నందితకు వరుస ప్రమాదాలు

Lasya Nanditha: ఎమ్మెల్యేగా గెలిచాక లాస్య నందితకు వరుస ప్రమాదాలు

Lasya Nanditha: ఎమ్మెల్యేగా గెలిచాక లాస్య నందితకు వరుస ప్రమాదాలు
X

శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(33) మరణించడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్య నందిత.. చిన్న వయస్సులోనే దుర్మరణ పాలవ్వడాన్నీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గ ప్రజలతో పాటు బీఆర్ఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి లాస్య నందితకు వరుస ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 24న ఓ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన లాస్య నందిత.. మూడు గంటల పాటు అందులోనే నరకం చూశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన న‌ల్ల‌గొండలో జరిగిన మాజీ సీఎం కేసీఆర్‌ సభకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఆమె ప్ర‌యాణిస్తున్న కారు(XL 6)ను నార్క‌ట్‌ప‌ల్లి వ‌ద్ద ఓ టిప్ప‌ర్ ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే లాస్య నందిత వెళ్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. ఆ ఘటనలో ఎమ్మెల్యే లాస్య త‌ల‌కు స్వ‌ల్ప గాయ‌మైంది. 10 రోజులు తిరగ్గముందే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. అప్పుడు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డా.. ఈసారి మాత్రం మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయింది.

ప్రమాదంపై పలు అనుమానాలు

పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద ఈ రోజు ఉదయం 4 గంటలకు ఆమె ప్రయాణిస్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో లాస్యనందిత సీటు బెల్ట్ పెట్టుకోలేదని, ప్రమాదం జరిగాక కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా .. ఆమెను మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారని తెలుస్తోంది. కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న ఆమె పీఏ ఆకాశ్‌, డ్రైవర్‌ తీవ్రంగా గాయపడగా.. వారిద్దరినీ మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్ కు తరలించారని సమాచారం. అయితే లాస్య నందిత ఎక్కడి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది? కారులో ఇంకెంతమంది ఉన్నారు? గతంలోని ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరే ఈ కారు కు డ్రైవింగ్ చేశాడా? లేక మరో డ్రైవరా?.. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్షమా? అన్న కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తొలి ప్రస్థానమదే..

దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె లాస్య నందిత. 2023 ఫిబ్రవరిలో సాయన్న మరణించడంతో.. ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత పోటీ చేశారు. ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టి ప్రయత్నాలే చేసినా.. నందితపై మాజీ సీఎం కేసీఆర్ నమ్మకం ఉంచారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. 2016లో కవాడిగూడ నుంచి లాస్య నందిత కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మాత్రం ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి సాయన్న వెంటే ఉంటూ.. నియోజకవర్గంలో మంచి పట్టు పెంచుకున్నారు.

Since winning as an MLA, Lasya Nanditha is facing a series of dangers

లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలం లో వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated : 23 Feb 2024 2:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top