Singareni CMD Sridhar : సింగరేణి CMD శ్రీధర్ బదిలీ.. కొత్త సీఎండీగా N.బలరాం..
X
సింగరేణి కొత్త సీఎండీగా బలరాం నియమితులయ్యారు. సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఉన్న N.బలరాంకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం విధుల్లో ఉన్న సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు పదవికాలం ముగియడంతో ఆయన్ను సాధారణ పరిపాలన శాఖ(GAD)లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.ఆయన స్థానంలోనే సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరామ్‌కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. సింగరేణి చరిత్రలో 9 ఏళ్ల పాటు సుధీర్ఘంగా కొనసాగిన సీఎండీగా రికార్డు సాధించారు. శ్రీధర్ హయాంలో సింగరేణి అనేక విజయాలు సాధించడంతో పాటు వివాదాల్లోనూ చిక్కుకుంది. శ్రీధర్ పదవీకాలం 2016 డిసెంబర్ 31నే ముగిసింది. కానీ కేసీఆర్ సర్కార్ ఒకసారి రెండేళ్లు, రెండుసార్లు ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఐదేళ్లకు మించి ఈ పదవిలో ఉండరాదని రూల్స్ చెబుతున్నాయి. కానీ శ్రీధర్ సీఎండీ పదవిలో తొమ్మిదేండ్లు పూర్తి చేసుకున్నారు. జనవరి 2021లో సింగరేణి సీఎండీగా శ్రీధర్‌ను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా శ్రీధర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. శ్రీధర్ తీరుపై మొదటి నుంచి విపక్షాలు, కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో శ్రీధర్ బదిలీ అయ్యారు. ఇన్‌చార్జి సీఎండీగా డైరెక్టర్ బలరాంకు బాధ్యతలు అప్పగించడం జరిగింది.