Singareni Elections : సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా
X
సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని ఇంధన శాఖ ఈ పిటిషన్ దాఖలు చేసింది. రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన శాఖ కోర్టును కోరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 21కి వాయిదా వేసింది.
కేంద్ర కార్మికశాఖ నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 28న ఎన్నికలు జరగాలి.. కానీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తితో హైకోర్టు ఎన్నికలను డిసెంబర్ 27కు వాయిదా వేసింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని ఇంధన శాఖ కోరింది. ఈ క్రమంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. కాగా 2019లోనే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ఏదో కారణంతో వాయిదా వేస్తూ వస్తోంది.