టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 1.63 కోట్ల లావాదేవీలు.. చార్జ్షీట్ దాఖలు
X
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. లీకేజీ వ్యవహారంలో ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సిట్ తేల్చింది. ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతుల మారిన నగదు వివరాలను స్వాధీనం చేసుకున్నామని చార్జ్షీట్లో తెలిపింది. మరికొంత మందిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు చెప్పింది.
‘‘పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు రూ.1.63కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ కేసులో ఇప్పటివరకు 49 మంది అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో 16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించారు. మరో నిందితుడు ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్నాడు. ఏఈ పేపర్ 13 మందికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ నలుగురికి లీకైంది. ఎనిమిది మంది అభ్యర్థులకు డీఏవో, ఏఈఈ పేపర్ ఏడుగురు అభ్యర్థులకు లీకైంది అని చార్జ్షీట్లో తెలిపింది.
ఏఈఈ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సిట్ తెలిపింది. ‘‘నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్, ఇతర పరికరాలను రామాంతపూర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాం. వాటని విశ్లేసిస్తున్న క్రమంలో మరింత సమాచానం బయటకొచ్చింది. డీఈ రమేష్ ఏఈఈ క్వశ్చన్ పేపర్ మరికొంతమందికి విక్రయించినట్లు భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది’’ అని సిట్ చార్జ్షీట్లో వివరించింది.