Home > తెలంగాణ > సర్పంచుల పాలన ముగిసింది.. ఇవాళ్టి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

సర్పంచుల పాలన ముగిసింది.. ఇవాళ్టి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

సర్పంచుల పాలన ముగిసింది.. ఇవాళ్టి నుంచి ప్రత్యేకాధికారుల పాలన
X

తెలంగాణలోని పల్లెల్లో ఇవాళ్టి నుంచి ప్రత్యేక పాలన షురూ కానుంది. నిన్నటితో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. సర్పంచుల పదవీకాలం పొడిగించాలని డిమాండ్లు ఉన్నా ప్రభుత్వం మాత్రం ప్రత్యేకాధికారుల పాలన వైపే మొగ్గు చూపింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం సర్పంచుల పదవీ కాలం ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించలేకపోతే ప్రత్యేకాధికారుల పాలన కొనసాగించాలి. ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం కష్టమని మంత్రి సీతక్క గతంలోనే చెప్పారు.

ఈ నేపథ్యంలోనే గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఇవాళ్టి నుంచి గ్రామాలు అధికారుల పాలనలోకి వెళ్తున్నాయి. మండలకేంద్రాలకు జిల్లా స్థాయి అధికారులు, మేజర్‌ పంచాయతీలకు తహశీల్దార్లు, ఎక్కువ జనాభా కలిగిన గ్రామాలకు ఎంపీడీవోలు.. మిగితా గ్రామ పంచాయతీలకు ఎంపీవో,ఎండీవో, ఏవో వంటి అధికారులు ప్రత్యేకాధికారులుగా కొనసాగనున్నారు. అంతకుముందు నాన్ గెజిటెడ్ ఆఫీసర్లను సైతం ప్రత్యేక అధికారులుగా నియమించాలని ప్రభుత్వం భావించినా.. తమకంటే పైస్థాయి వాళ్లనే ప్రత్యేక అధికారులుగా నియమించాలని పంచాయతీ కార్యదర్శులు కోరారు.

ఈ నేపథ్యంలో గెజిటెడ్ ఆఫీసర్లు మాత్రమే ప్రత్యేకాధికారులుగా నియమించారు. కాగా రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2019 జనవరి 21, 25, 30న మూడో విడుతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నిన్నటితో వారి పదవీకాలం ముగిసింది. అయితే జూన్ వరకు తమనే కొనసాగించాలని సర్పంచులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ప్రత్యేక అధికారుల పాలనకే జై కొట్టింది. ప్రస్తుతం ఉన్న సర్పంచుల్లో బీఆర్ఎస్ కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకాధికారుల పాలనకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Updated : 2 Feb 2024 1:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top