Home > ఆంధ్రప్రదేశ్ > Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
X

మార్చి 1వ తేదీ నుంచి 11 వరకు నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం ఆలయం సుందరంగా ముస్తాబైంది. ఆలయంలో గోపురాలను విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చె భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసేందుకు దేవస్థాన యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూలైన్లు మంచినీరు, భోజనం వసతి తదితర భారీ ఏర్పాట్ల పనులపై అధికారులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయం ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు.

శుక్రవారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 8న పాగాలంకరణ, కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్నారు. జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని ఈవో పెద్దిరాజు వెల్లడించారు. 5వ తేదీన సాయంత్రం 7:30 నుంచి 11 గంటల వరకు వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కి ఏర్పాట్లు చేశామని ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..

*మార్చి 1వ తేదీ (శుక్రవారం)- ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

*మార్చి 2వ తేదీ- భృంగీ వాహన సేవ, ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు.

*మార్చి 3వ తేదీ- హంస వాహన సేవ, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పణ

*మార్చి 4వ తేదీ- మయూర వాహన సేవకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పణ.

*మార్చి 5వ తేదీ- రావణ వాహన సేవకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పణ

*మార్చి 6వ తేదీ -పుష్పపల్లకీ సేవ

*మార్చి 7వ తేదీ- గజవాహన సేవ

*మార్చి 8వ తేదీ- మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ప్రభోత్సవం, నంది వాహన సేవ. లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం, కల్యాణోత్సవం

*మార్చి 9వ తేదీ- రథోత్సవం, తెప్పోత్సవం

*మార్చి 10వ తేదీ- ధ్వజావరోహణం

*మార్చి 11వ తేదీ- అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. గురువారం మీడియా సమావేశంలో.. ప్రతి భక్తుడు స్వామిఅమ్మవార్ల దర్శనం చేసుకుని సంతృప్తికరంగా వెళ్లే రీతిలో సౌకర్యాలు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు దాదాపు 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు, మార్గమధ్యలో 13 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు. అందుకోసం అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్రాగునీరు, పాలు, అల్పాహారం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవోకు సూచించారు. తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రణాళికలతో పార్కింగ్ చేసుకుని తిరిగి వెళ్లేందుకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

Updated : 29 Feb 2024 9:32 PM IST
Tags:    
Next Story
Share it
Top