నాది కన్నింగ్ మెంటాలిటీ కాదు.. గవర్నర్ తమిళిసై
X
తెలంగాణ తొలి మహిళ గవర్నర్‌గా పనిచేయడం తన అదృష్టమన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా.. మొదటి మహిళా గవర్నర్ గా 2019 సెప్టెంబర్ 8 వ తేదీన తమిళిసై బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నుంచి గవర్నర్ గా కొనసాగుతూ నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని ఐదో సంవత్సరం లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా శుక్రవారంనాడు రాజ్ భవన్ లో కాఫీ టేబుల్ బుక్ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గవర్నర్ గా తనకు కొన్ని పరిమితులున్నాయన్నారు. నిబంధనలతో తనను అడ్డుకోలేరని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నించినట్టుగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. సవాళ్లు, పంతాలకు కూడ తాను భయపడబోనన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో తనను కట్టడి చేయలేరని ఆమె తేల్చి చెప్పారు. తాను ఎక్కడ ఉన్న తెలంగాణ ప్రజలతో ఉన్న బంధం మరిచిపోలేనన్నారు. తనది మోసం చేసే మనస్తత్వం కాదన్నారు.
రాజ్యాంగ పరిరక్షరాలిగా తన బాధ్యతలను తాను నిర్వహిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు.ప్రజల విజయమే తన విజయంగా ఆమె పేర్కొన్నారు.సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టుగా తమిళిసై సౌందరరాజన్ గుర్తు చేసుకున్నారు.తనపై తెలంగాణ ప్రజలు చూపిన అభిమానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా పనిచేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు 15 శాతం మాత్రమే సేవ చేశానన్నారు. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు. తనది కన్నింగ్ మెంటాలిటీ కాదని గవర్నర్ తెలిపారు.