చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు.. శంషాబాద్లో..
X
చాక్లెట్లు అంటే పిల్లలకు మహా ఇష్టం. చాక్లెట్లు ఇస్తామంటే ఎక్కడికైనా వెళ్తుంటారు. అయితే ఓ చోట చాక్లెట్లు తిన్న విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు. క్లాసు రూంలోనే పడుకుంటున్నారు. టీచర్లు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. కొత్తూరు స్కూల్ సమీపంలో పాన్ షాపులు ఉన్నాయి. ఈ షాపుల నిర్వాహకులు కొన్ని రోజులుగా విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేస్తున్నారు. ఇవి తిన్న విద్యార్థులు మత్తులో వింతగా ప్రవర్తిస్తున్నారు. పైగా క్లాసు రూంలోనే నిద్రపోతున్నారు.
విద్యార్థుల తీరును గమనించిన టీచర్లు అసలేం జరిగిందో ఆరా తీశారు. అయితే చాక్లెట్లు తిన్నాకే ఇలా జరుగుతుందని విద్యార్థులు చెప్పారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. టీచర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చాక్లెట్ల్స్ లో ఏదైనా డ్రగ్స్ మిక్స్ చేశారా లేక ఇంకా ఏదైనా కలిపారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.