ఈ నెలలో మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు
X
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఈ నెల 29, 30 తేదీల్లో స్కూళ్లకు సెలవులు ఉండనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనున్నందున ఆ రోజుతో పాటు ముందురోజు కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారు. మొత్తం 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది టీచర్లు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటారు. పోలింగ్ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు సిబ్బంది ముందురోజు మధ్యాహ్నం నుంచే చేరుకుంటారు. నవంబర్ 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల నవంబర్ 29, 30 తేదీల్లో బడులకు సెలవులని విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి.
ఇంకో రోజు కావాలి..
ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సూచన మేరకు అధికారికంగా ప్రకటించనున్నారు. పోలింగ్ పూర్తయ్యి ఈవీఎంలను తీసుకొని ఆయా కేంద్రాలకు వెళ్లి సమర్పించి వచ్చే సరికి అర్ధరాత్రి దాటుతుందని, అందువల్ల విధుల్లో పాల్గొన్న వారికి డిసెంబరు 1వ తేదీ కూడా సెలవు ఇవ్వాలని రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ఎన్నికల సంఘాన్ని కోరారు.