Sunita Mahender Reddy : దద్దరిల్లిన చేవెళ్ల సభ..ఎంపీ సీటు ఆమెదే?
X
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నేడు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ జరిగింది. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సభలో సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంత వరకూ ఆమె సీఎం పక్కనే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు ఈసారి ఎంపీ సీటు ఖాయమని తెలుస్తోంది. సభకు వచ్చినవారంతా ఈసారి చేవెళ్ల ఎంపీ సీటు సునీతా మహేందర్ రెడ్డికే ఇస్తారని చర్చించుకున్నారు.
చేవెళ్ల ఎంపీ స్థానానికి బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డి పోటీ చేసే ఛాన్సుందని ఎప్పటినుంచో అందరూ అనుకుంటున్నారు. వారి అనుమానం నేటితో తీరిపోయిందని చెప్పాలి. ఒక వేళ చేవెళ్ల నుంచి సునీతా రెడ్డి పోటీ చేస్తే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయి. నేటి సభలో చేవెళ్ల ఎంపీ స్థానంలో ఆమే ఉంటారని మరోసారి స్పష్టమైంది.
ఇకపోతే ఈ సభకు ప్రియాంకగాంధీ రావాల్సి ఉంది. అయితే ఆమె పర్యటన రద్దయ్యింది. దీంతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలలో పాల్గొన్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్, బీజేపీ నామరూపం లేకుండా పోతాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుందని ధీమా వ్యక్తం చేశారు.