MLA Vanama Venkateswara Rao Disqualification : వనమా వెంకటేశ్వర రావుకు సుప్రీంకోర్టులో రిలీఫ్
X
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికింది. ఆయన అనర్హతపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
2018 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఆ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇటీవల ప్రకటించింది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించినందుకు కోర్టు అనర్హత వేటు వేయడంతో పాటు రూ.5 లక్షల ఫైన్ విధించింది. పిటిషనర్ జలగం వెంకట్ రావుకు కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా అప్పటి బీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థి జలగం వెంకట్‌రావును ఎమ్మెల్యేగా ధర్మాసనం ప్రకటించింది.
కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. అనంతరం అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసిన జలగం వెంకట్‌రావు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు.