పీవీకి భారతరత్న.. ఆయన కూతురు ఏమన్నారంటే..?
X
తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. దేశానికి ఆయన చేసిన సేవలకుగానూ మరణానంతరం అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వేగుచుక్కగా భారతావని ఎదగడానికి నిరంతర సంస్కరణలతో జీవం పోసిన వ్యక్తి పీవీ నరసింహారావు. ఆయనకు భారతరత్న రావడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన తండ్రికి భారతరత్న రావడం పట్ల ఆయన కూతురు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి సంతోషం వ్యక్తం చేశారు.
పీవీ నరసింహారావుకు భారతరత్న రావడం తెలంగాణకు గర్వకారణమని సురభి వాణి దేవి అన్నారు. కొంత ఆలస్యమైనా ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పీవీకి ఈ అవార్డు ఇవ్వడంతో భారతరత్నకే విలువ పెరిగిందన్నారు. పీవీ సేవలను దేశం ఎన్నటికి మరచిపోదని చెప్పారు. పీవీ సంస్కరణలకు ఆద్యుడు అని గుర్తుచేసుకున్నారు. ప్రమాదం అంచున ఉన్న దేశ ఆర్థికవ్యవస్థను మలుపుతిప్పారన్నారు. పార్టీలకతీతంగా ఆయన పనిచేశారని చెప్పారు.