హిటెక్కిన 'అవిశ్వాసం' పాలిటిక్స్.. కోదాడ ఎంపీపీ చింత కవితారెడ్డి పదవికి రాజీనామా
X
రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు జిల్లాలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఆయా జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గోండ జిల్లాలో ప్రస్తుత రాజకీయం.. అవిశ్వాసం చుట్టే తిరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా.. వీటిలో ప్రధానమైన నల్గొండతో పాటు కోదాడ, భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టారు కాంగ్రెస్ కౌన్సిలర్లు.
ఇందులో భాగంగానే ఈ రోజు నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ పార్టి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా సోమవారం ప్రవేశ పెట్టి అవిశ్వాస తీర్మానానికి 47మంది కౌన్సిలర్ హాజరయ్యారు. వీరిలో 41మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టికి మద్దతు తెలపడంతో మున్సిపల్ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టి కైవసం చేసుకుంది.
ఇక సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింతా కవితారెడ్డి అక్రమాలపై ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ లో ఎంపీటీసీలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపణలు కూడా చేశారు. ఈ నెల 17 న ఆవిడపై అవిశ్వా స తీర్మానం ఉండగా... ముందుగానే తన పదవి రాజీనామా చేసి, రాజీనామా లేఖను జిల్లా సీఈవో సురేష్ కుమార్‌కు అందజేశారు. ఇక భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ హస్తగతం చేసుకోనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.