హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణపై సస్పెన్షన్ ఎత్తివేత
X
హైదరాబాద్ లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణకు( OSD Harikrishna ) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో హరికృష్ణ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను సస్పెండ్ చేయడాన్ని హరికృష్ణ హైకోర్టులో( High Court ) సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సస్పెండ్ చేసే అధికారం మంత్రికి లేదని తేల్చి చెప్పింది. అలాగే కమిటీ విచారణలో ఆరోపణలు కూడా రుజువు కాకపోవడంతో హరికృష్ణ సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేసింది.
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో విద్యార్థినులపై ఓఎస్డీ హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు గతేడాది ఆగష్టులో వార్తలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వార్తలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టి, పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ట్విటర్ వేదికగా అప్పటి క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు. ఆ వెంటనే స్పందించిన మంత్రి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీతో విచారణకు ఆదేశించారు. హరికృష్ణ స్థానంలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఇన్‌చార్జి ఓఎస్డీగా హైదరాబాద్ జిల్లా క్రీడా అధికారిగా పనిచేస్తున్న సుధాకర్‌ను నియమించారు.