Telangana Elections: సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరం
X
ఓటింగ్ అనేది అత్యంత రహస్య ప్రక్రియ. ఓటర్లు తమకి నచ్చిన అభ్యర్థికి నిర్భయంగా ఓటేయాలని.. వేసిన ఓటు ఎవరికి వేసారో అత్యంత రహస్యంగా ఉంచి ఓటరు మహాశయుని హక్కుకు భంగం కలగకుండా చూడాలని రాజ్యాంగం చెప్పే మాట. కానీ.. ఉత్సాహం ఆపుకోలేక ఓటేస్తూ సెల్ఫీలు దిగి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అడ్డంగా బుక్ అవుతారు జాగ్రత్త. పోలింగ్ కేంద్రాల్లోకి అసలు సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లడం నిషేధమని చెబుతున్నారు అధికారులు. ఒకవేళ వాళ్ల కన్నుగప్పి, లేదంటే పొరపాటున తీసుకెళ్లినా...ఇబ్బందులకు గురికాక తప్పదు.
ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరం. వేసిన ఓటును ఫొటో తీసి ఇతరులకు చూపించడం, పంపించడం కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, శిక్షార్హం. ఎన్నికల సంఘం ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 49 (ఎం) ప్రకారం ఓటు రహస్యాన్ని బహిర్గతం చేయకూడదు. ఎవరైనా ఇలా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎన్నికల అధికారులు గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేస్తారు. పోలింగ్ అధికారి ఆ ఓటరు ఓటును 17-ఏలో నమోదు చేస్తారు. లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అంటే.. ఆ ఓటు రద్దు అయినట్లే లెక్క.
అంధులు ఓటు వేసేందుకు 18 ఏళ్లు దాటిన సహాయకుడిని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లవచ్చు. అంధుడి ఓటును బహిరంగ పరచనని సహాయకుడు సంబంధిత పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారికి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఓటుహక్కు వినియోగించుకున్న వారిని మాత్రమే అంధుల సహాయకులుగా అనుమతిస్తారు.