తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్టాలిన్ మద్దతు
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ తన శ్రేణులను కోరింది. నవంబర్ 30 జరిగే ఎన్నికల్లో తెలంగాణలోని డీఎంకే కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి ‘ఇండియా’లో డీఎంకే భాగస్వామి కావడం తెలిసిందే.
తెలంగాణ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిని గెలిపించాలని ద్రవిడ మున్నేట్ర కగజం తన శ్రేణులను కోరింది. ‘‘ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయండి. వారిని భారీ మెజరిటీతో గెలిపించండి’’ అని ట్విటర్లో పిలుపునిచ్చింది. జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే సన్నాహాల్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదివరకు చెన్నై వెళ్లి స్టాలిన్‌తో చర్చలు జరిపారు. అయితే స్టాలిన్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఈసారి ఎలాగైనా ఓడగొట్టాలని విపక్షాలు కాంగ్రెస్ గొడుగుకు కిందికి చేరాయి.