Governor: ఎట్‌హోంకు కేసీఆర్ గైర్హాజరు.. గవర్నర్ రియాక్షన్ ఇదే
X
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా మూడోసారి గైర్హాజరయ్యారు. అయితే ఈసారి మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరుకాలేదు. సీఎం హాజరుకాకపోవచ్చంటూ రెండు రోజుల ముందుగానే అంతా అనుకుంటూనే ఉన్నారు. ఈ వార్తలకు బలం చేకూరే విధంగానే నిన్న కేసీఆర్ .. రాజ్‌భవన్ కు రాలేదు. గత కొంతకాలంగా రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. కీలకమైన బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తన వద్దే వుంచుకోవడంతో ప్రభుత్వ పెద్దలు ఆమెపై గుర్రుగా వున్నారు.
ఇదే విషయాన్ని పరోక్షంగా .. గోల్కొండ కోట నుంచి చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావించారు. “రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోడానికి విఫల ప్రయత్నాలు చేశాయి” అంటూ పరోక్షంగా గవర్నర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దానికి కొనసాగింపుగా “కానీ వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది..” అని అన్నారు.
అయితే ఆనవాయితీ ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు సాయంత్రం పూట గవర్నర్ ఇచ్చే తేనీటి విందు కార్యక్రమానికి ప్రభుత్వం తరఫు పెద్దలెవరూ రాలేదు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ.. గవర్నర్‌ల విషయంలో ముఖ్యమంత్రుల తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారని అన్నారు. తమిళనాడులో గవర్నర్, ముఖ్యమంత్రి సంబంధాలను ప్రస్తావిస్తూ పుదుచ్చేరిలో ఆమె చేసిన కామెంట్లను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... తాను ఒకేసారి తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ డొమెయిన్‌లో ఉన్నాయన్నారు. ఏమేం కామెంట్లు చేశామన్నది ఇప్పటికే ప్రజలకు చేరిందని, మరోసారి ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు. గవర్నర్లపై ముఖ్యమంత్రుల తీరు ఈ తరహాలో ఉండడం మంచిది కాదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన ఆమోదం కోసం వచ్చిన బిల్లులు పరిశీలనలో ఉన్నాయని, వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు. అయినా వాటిపై స్పందించడానికి ఇది తగిన సమయం కాదన్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రికి రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్ళిందని, ఆయన హాజరవుతారనే అనుకున్నామని, కానీ గైర్హారజయ్యారని తెలిపారు. ఆహ్వానం అందుకున్న తర్వాత రావడం, రాకపోవడం ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారమని, అది రాజ్‌భవన్ పరిధిలోని అంశం కాదన్నారు.