Home > తెలంగాణ > సీఎం రేవంత్ రెడ్డితో టాటా సన్స్ చైర్మన్ భేటీ.. పెట్టుబడులపై చర్చ

సీఎం రేవంత్ రెడ్డితో టాటా సన్స్ చైర్మన్ భేటీ.. పెట్టుబడులపై చర్చ

సీఎం రేవంత్ రెడ్డితో టాటా సన్స్ చైర్మన్ భేటీ.. పెట్టుబడులపై చర్చ
X

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ సిద్ధంగా ఉందని టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. టాటా గ్రూప్కు తెలంగాణ ఒక వ్యూహాత్మకమైన ప్రాంతమని చెప్పారు. దావోస్లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డితో నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. తెలంగాణలో టాటా గ్రూప్ వ్యాపార విస్తరణ, మరిన్ని పెట్టుబడులపై చర్చించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హైదరాబాద్లో 80వేలకు ఉద్యోగులను కలిగి ఉందని చెప్పారు. వచ్చే రోజుల్లో దీనిని విస్తరించేందుకు భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు.

ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 50 ప్రభుత్వ ఐటీఐలలో అధునాతన స్కిల్లింగ్ సెంటర్‌ల ఏర్పాటుతో పాటు మాస్టర్ ట్రైనర్లను నియామకానికి సంబంధించి టీటీఎల్ రూ.1500కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మొత్తంలో దేశీయ, అంతర్జాతీయ ఎయిర్ ఇండియా విమానాలను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

తెలంగాణ అభివృద్ధిలో టాటా గ్రూప్ కీలక భాగస్వామి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ రంగాల్లో టాటా గ్రూప్కు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఐటీఐల్లో అధునాతన సాంకేతిక కేంద్రాలను స్థాపించడానికి టీటీఎల్ తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా టాటా గ్రూప్ ను తెలంగాణలో వీలైనంత వరకు విస్తరిస్తామని నటరాజన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నామని వివరించారు.




Updated : 18 Jan 2024 6:32 PM IST
Tags:    
Next Story
Share it
Top