న్యూఇయర్ ఆంక్షలు.. రైడ్ క్యాన్సిల్ చేస్తే 500 జరిమానా
X
కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించేందుకు హైదరాబాద్ మహా నగరం సిద్ధం అయింది. పలు రకాల ఈవెంట్లతో జంట నగరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. దీంతో సిటీలో జరిగే వేడుకలు సజావుగా సాగేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బార్, పబ్, క్లబ్ లు నడిపేవారికి కీలక సూచనలు చేశారు. మద్యం సేవించిన కస్టమర్‌లు వాహనాలు నడపడానికి అనుమతిస్తే, నేరాన్ని ప్రోత్సహించినందుకు పబ్ యజమానిపై చర్యలు తీసుకోనున్నారు. మద్యం సేవించిన వారికి సొంత వాహనాలు కాకుండా.. ప్రత్యామ్నాయ వాహనాలను ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫ్లై ఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్డులను పూర్తిగా మూసేస్తున్నారు. నగరంలోకి కీలక మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌వైపు రాత్రి 10గంటల నుంచి 2 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపేస్తున్నారు.
డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. రాత్రి 8 గంటల నుంచే సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. క్యాబ్‌లు, టాక్సీ, ఆటో రిక్షాల డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలని, డాక్యూమెంట్స్ వెంట ఉంచుకోవాలి పోలీసులు సూచించారు. తమకు వచ్చిన రైడ్స్ ను ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ చేయొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించనున్నట్టు పోలీసులు ప్రకటించారు. రైడ్ రిజెక్టు చేస్తే వాహనం నెంబరు, టైం, ఏరియా.. మొదలైన వివరాలతో వాట్సాప్ 9490617346 కు ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు. ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదని, అదనపు ఛార్జీలు డిమాండ్ చేయొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు.