తెలంగాణ బీరు బాబుల ఆల్ టైమ్ రికార్డ్
X
మండు వేసవిలో చల్లచల్లగా కూల్‌కూల్‌గా అమాయకంగా పుచ్చకాయలు, తాటిముంజలు తినేవాళ్లు కొందరు. లస్సీలు, పళ్లరసాలతో సేదదీరేవాళ్లు మరికొందరు. చిల్లుచిల్లుగా బీర్లేసేవాళ్లు చాలా చాలా చాలా మంది. టైమ్ దొరికితే చాలు ఏసెయ్యడమే. చావైనా, పెళ్లయినా ఏదైనా సరే బుస్సుమని బుసబుసా పొంగాల్సిందే. పైగా సమ్మర్ సాకు ఒకటి. ఫలితంగా రికార్డుల మోత మోగిపోయింది. తెలంగాణలో మే నెలలో బీర్ల అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయి. విస్కీ, బ్రాందీల పక్కకు తన్నేసి తనే హీరో అనిపించుకుంచి చల్లని సీసా.
31 రోజుల్లో తెలంగాణ బీరుబాబులు 7 కోట్ల 44 లక్షల సీసాలు లాగించారు. అంటే, రోజుకు 24 లక్షల బీర్లను పొట్టలో పోసుకున్నారు. లీటర్లలో చెప్పాలంటే అన్ని సైజుల బీర్లు కలుపుకుని 4 కోట్లు లీటర్లు తాగి వదిలేశారు. 2019 మే నెల నాటి 60 లక్షల రికార్డును బీభత్సంగా బద్దలు కొట్టారు. రాష్ట్రంలో సాధారణంగా నెలకు దాదాపు 30 లక్షల బీర్లు అమ్ముడవుతాయి. ఎండాకాలంలో మాత్రం కేవలం ఒక్క రోజులో ఆ స్థాయిలో అమ్ముడుబోవడం విస్తుగొలుపుతోంది. బీరు బాటిళ్లు ఇటు జనానికి ఖుషీ, అటు ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. ఈ ఆదాయానికి డ్రంక్ డ్రైవింగ్ పేరుతో ఎగస్ట్రాగా దండుకునే సొమ్ము అదనం. తాగుడు సంగతెలా ఉన్నా హాట్, కూల్ వల్ల కొంపలు గుల్ల అవుతున్నాయని మహిళలు మొత్తుకుంటున్నారు. ఇంట్లోకి రూ. 130 మంచినూనె ప్యాకెట్ తీసుకురమ్మంటే పట్టించుకోకుండా రూ. 500 తగలేసి రెండు సీసాలు తాగి వస్తున్నారని భోరున విలపిస్తున్నారు.