తెలంగాణ పశుసంవర్ధక శాఖలో ఫైళ్లు మాయం
X
తెలంగాణ పశుసంవర్ధక శాఖలో కీలకమైన ఫైళ్లు మాయమైనట్లు తెలుస్తోంది. ఆ శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్ ఆఫీసులోని ఫైళ్లు కనిపించడం లేదని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో కల్యాణ్ శుక్రవారం ఆఫీసుకు వచ్చి ఫైళ్లను చించేసి మూటగట్టుకుపోతుండంగా అధికారులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కల్యాణ్ పదవీ కాలం ముగిసిపోయినా కార్యాలయానికి ఎందుకు వెళ్లారనే సందేహాలు తలెత్తుతున్నాయి.
అయితే తను పాత పేపర్ల కోసం వచ్చానని, డైరెక్టరేట్‌లోని ఫైళ్లను ఇప్పటికే జీఏడీకి అందించామని కల్యాణ్ చెబుతున్నారు.
ఫైళ్ల గల్లంతుపై ఫిర్యాదు రావడంతో సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ దర్యాప్తు ప్రారంభిచారు. ఫైళ్లు గల్లంతైన విషయం తనకు తెలియదని పశుసంవర్ధక శాఖ డైరెక్ట్ అంటున్నారు. కాగా పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 1న భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని మంటలు లేవడంతో ఫైళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లఘనకు పాల్పడ్డారని పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌ను, ఆయన ఓఎస్డీ సత్యనారాయణను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన నేపథ్యంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు లేచినట్లు పోలీసులు చెప్పారు.