Telangana Assembly : అసెంబ్లీ వాయిదా.. సోమవారం బడ్జెట్పై చర్చ
X
(Telangana Assembly) అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభాపతులు ఉభయసభల్ని వాయిదా వేశారు. తెలంగాణ మూడో శాసన సభలో రేవంత్ రెడ్డి సర్కారు మొదటి పద్దును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభ ముందుంచారు. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు గంటా 15 నిమిషాల పాటు ఆయన బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. అటు మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను శాసనమండలి ముందు ఉంచారు. ఇరు సభల్లో బడ్జెట్ ప్రసంగాలు ముగిసిన వెంటనే వాయిదా పడ్డాయి.
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సోమవారం చర్చ జరగనుంది. అనంతరం సభ ఆమోదం పొందనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేటాయించే నిధులకు సంబంధించి స్పష్టత లేనందున రేవంత్ సర్కారు సైతం ఈసారి ఓట్ ఆన్ బడ్జెట్ కు మొగ్గుచూపింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కొలువుదీరే కొత్త సర్కారు పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ సభ ముందు ఉంచనుంది.