Telangana Assembly : కులగణన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
X
కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందు దీనిపై చర్చ సాగింది. బీఆర్ఎస్ సభ్యులు పలు అభ్యంతరాలు లేవనెత్తగా.. అన్నింటిని పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతామని అధికార పార్టీ చెప్పింది. దీంతో ఈ తీర్మానానికి బీఆర్ఎస్ సైతం ఆమోదం తెలిపింది.
కుల గణనపై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ అంశంపై ఎలాంటి రాజకీయాలు చేయవద్దని కోరారు. బలహీన వర్గాల కోసమే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. కులగణన తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడిన పొన్నం పదేండ్ల బీసీ లెక్కలు తీస్తే బీఆర్ఎస్ బాగోతం బయటపడుతదని స్పష్టం చేశారు. కులగణన విషయంలో అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని పొన్నం అన్నారు. నిర్మాణాత్మక సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. అఖిలపక్షం, బలహీన వర్గాల శాసన సభ్యులు, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయలు కూడా తీసుకుంటామని స్పష్టంచేశారు.
అంతకుముందు మాట్లాడిన రేవంత్.. బీసీ కులగణనకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బీసీ కులగణనను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని తెలిపారు. బీసీల కోసం ముందు నుంచి పోరాటం చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో కూడా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని డిమాండ్ చేశారని తెలిపారు.