EC Ban:ఎస్‌ఎంఎస్‌లపై ఎన్నికల కమిషన్ నిషేధం
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం(ఈరోజు) సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాల(Wine shop)తోపాటు ఎస్‌ఎంఎస్‌లపై (SMS) కూడా ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. సైలెన్స్ పీరియడ్‌లో (Silence Period) అభ్యంతకర, రాజకీయపరమైన, బల్క్ ఎస్‌ఎంఎస్‌లను (Bulk SMS) పంపించకూడదని అధికారులు ఆదేశించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఈసీ ఆదేశాలు, సూచనలను ఉల్లంఘించేలా ఎస్‌ఎంఎస్‌లు పంపరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు అయ్యే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
ఇక ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అప్రమత్తం చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకపోతే.. లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.