Telangana Assembly: ముగిసిన బీఏసీ మీటింగ్.. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఇదే
X
తెలంగాణ అసెంబ్లీలో బీఏసీ(Business Advisory Committee) మీటింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎల్లుండి(శనివారం) తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 12, 13న ద్రవ్య బిల్లుపై చర్చ జరగనుంది. రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ పనిదినాలను, ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేశారు. బీఏసీ సమావేశానికి కేసీఆర్ బదులుగా హరీష్ రావు రావడంపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన బదులుగా హరీష్ రావు బీఏసీకి వస్తారని ముందే కేసీఆర్ సమాచారం ఇచ్చారు. అయినా శ్రీధర్ బాబు అభ్యంతరం చెప్పడంతో కాసేపటి తర్వాత బీఏసీ నుంచి హరీష్ రావు బయటకు వచ్చేశారు. అలాగే బీఆర్‌ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి బలాల, సీపీఐ ఎమ్మేల్యే కూనంనేని సాంబశివ రావు హాజరయ్యారు.