Home > తెలంగాణ > Telangana BJP Candidates First List: నేడు తెలంగాణ బీజేపీ తొలి జాబితా

Telangana BJP Candidates First List: నేడు తెలంగాణ బీజేపీ తొలి జాబితా

Telangana BJP Candidates First List: నేడు తెలంగాణ బీజేపీ తొలి జాబితా
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలి జాబితా శుక్రవారం విడుదల కానున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదలై చాలా రోజులు కావొస్తున్నా బీజేపీ మాత్రం ఇంత వరకు అభ్యర్థులను ప్రకటించ లేదు. సరైన అభ్యర్థులు లేకపోవడం, ఇతర పార్టీల నుంచి వలసలు ఉంటాయనే కారణంతో ఇన్నాళ్లూ జాబితాను విడుదల చేయలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది.

గురువారం బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ నివాసంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అనేక సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ పాల్గొన్నారు. వీరితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధాన నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు, సామాజిక వర్గాల వారీగా సీట్ల కేటాయింపు, మెజారిటీ ప్రజలు టికెట్ ఆశిస్తున్న స్థానాలు… వీటిపై చర్చ జరిగింది. ఆ తర్వాత కోర్ కమిటీ సభ్యులు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పలుమార్లు కలిశారు. ఈ సమావేశాల అనంతరం గురువారం రాత్రి నడ్డా నివాసంలో కమిటీ మరోసారి సమావేశమైంది.

ఇక ఇవ్వాళ ఉదయం 11 గంటలకు మరోసారి జేపీ నడ్డాతో సభ్యులు భేటీ కానున్నారు. తుది జాబితాను అప్పుడే సిద్ధం చేసి.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొంటారు. అక్కడ తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు సంబంధించిన పెండింగ్ లిస్టుపై చర్చ జరుగనున్నది. బీజేపీ రాష్ట్ర అభ్యర్థులకు సంబంధించి తొలి లిస్టులో 65 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం రాత్రిలోగా ఈ లిస్టు విడుదల అవుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Updated : 20 Oct 2023 9:58 AM IST
Tags:    
Next Story
Share it
Top