కాంగ్రెస్ వైపు తెలంగాణ కాషాయ ఎంపీ చూపు! బీజేపీ పదవుల ఎఫెక్ట్..
X
‘‘ఇన్నేళ్లుగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నా. పార్టీపై విమర్శలను చీల్చిచెండాడుతున్నా.. నానా బూతులూ మాట్లాడుతున్నా. సీఎం కుటుంబాన్ని, ఆయన బిడ్డను నాకంటే ఎక్కువగా ఎవరు విమర్శించారు? అయినా నాకు అన్యాయం చేశారు? ఇలాగైతే పార్టీలో ఉండేదెలా? ముందొచ్చిన చెవుల కంటే వెనక్కొచ్చిన కొమ్ములు ఎక్కువా? కంచిగరుడ సేవ చేయడం నా వల్ల కాదు. నాకు వేరే పార్టీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి.. ఆలోచిస్తున్నా.. ’’ ఇదీ, తెలంగాణలో ఓ బీజేపీ ఎంపీ అక్కసు, ఆగ్రహం, హెచ్చరిక!
తెలంగాణ బీజేపీ కమిటీలో మార్పుల చేర్పులపై అంసతృప్తితో ఉన్న కీలక నేతలు.. అయితే కాంగ్రెస్, లేకపోతే బీఆర్ఎస్ ఆప్షన్లు ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈటలకు పార్టీ ఎన్నికల కమిటీ అధ్యక్ష పదవి అప్పగించడం పాత నేతలకు ఏమాత్రం జీర్ణం కావడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి కట్టబెడతారని తొలి నుంచి సంకేతాలు వెలువడడంతో ఎన్నికల కమిటీ బాధ్యతలను తమకు అప్పగిస్తారని ఇద్దరు ముగ్గురు నేతలు పెట్టుకుని ఉన్నారు. ఈటల తన హవాతో ఆ పదవిని దక్కించుకోవడంతో లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఓ ఫైర్ బ్రాండ్ ఎంపీ అధిష్టానానికి గట్టి షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కమలనాథుల తీరుతోపాటు ఇంటి సమస్యలు కారణంగానూ ఆయన పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం..
గత పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన బలమైన ప్రత్యర్థిని మట్టి కరిపించిన తనకు అధిష్టానం ప్రాధాన్యమున్నర పదవి ఇస్తుందని ఆయన ఆశించారు. అయితే తనను పక్కనపెట్టి ఈటల రాజేందర్‌ను అందలం ఎక్కించడం ఆయనకు జీర్ణం కాలేదు. దీనికి తోడు తనను గెలిపించడానికి కారణమైన కీలక డిమాండును కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో రైతన్నలు తనపై ఆగ్రహంతో మండిపడుతున్నారు. ఇంకోపక్క ఇంట్లో ముసలం. రాష్ట్ర కాంగ్రెస్‌కు సారథ్యం వహించి, తర్వాత బీఆర్ఎస్ తరఫున ఎంపీగా ఎన్నికై మళ్లీ కాంగ్రెస్లో చేరి, బయటికొచ్చిన తండ్రి, కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న సోదరుడి వ్యవహారాలు ఆయన కషాయ దళంలో పైకి ఎదగకపోవడానికి ప్రతికూల అంశాలుగా మారాయి. దీనికి తోడు కుటుంబసభ్యులే తనపై ఆరోపణలు గుప్పిస్తుండంతో బీజేపీలో ఇమడలేని పరిస్థితి ఎదురైంది. ఎన్నికలవేళ తనను పక్కన పెట్టిన హైకమాండ్ ఎన్నికలు ముగిశాక అంతకంటే గొప్పగా గౌరవించేదేమీ ఉండడని ఆయన పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నారని, ఇంట్లో కూడా ఎలాంటి గొడవా లేకుండా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.