కేసీఆర్ అణచివేత వల్లే... డీజీపీ అయ్యేవాణ్ని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందని ఆ పార్ట రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. దళిత, బహుజనులకు రాజ్యాధికారం సాధించి పెట్టడమే తమ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో జరిగిన వడ్డెర మహాసభలో ఆయన మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ అణచివేత ధోరణి సహించలేకనే నేను ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. పదవిలోనే కొనసాగి ఉంటే రాష్ట్రానికి డీజీపీని అయ్యేవాడిని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్నా ఇప్పటికే ఉద్యమకారులపై కేసులు ఉండడం శోచనీయం. పాలక వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉన్న బహుజనులకు అధికారం దక్కకుండా అణచివేతకు పాల్పడుతున్నాయి’’ అని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల్లో ఎంతమంది ప్రగతిభవన్, అసెంబ్లీ మెట్లు ఎక్కారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. దళితులు, బీసీలు సహా అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై రావాలని, అసలైన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు. బడుగు వర్గాలకు అధికారం రావాలంటే కలిసికట్టు పోరాటాలే శరణ్యమని అన్నారు. ‘‘మనలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారా? మనకు తెలివిలేదా? తెలివి ఎవరి సొత్తూ కాదు. మనం మేల్కొవి. పదవులను అడుక్కోవడం కాదు గట్టిగా పోరాడి సాధించాలి’’ అని అన్నారు.