TS Assembly Meeting : రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టనున్న రేవంత్ సర్కారు
X
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టనుంది. ఇటీవల అదికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే తొలి బడ్జెట్. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రాలకు ఇచ్చే నిధులకు సంబంధించి స్పష్టత రానందున తెలంగాణ ప్రభుత్వం సైతం ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఎన్నికల తర్వాత కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సైతం పూర్తి స్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.
బడ్జెట్ సెషన్ నేపథ్యంలో సమావేశాల నిర్వాహణ, భద్రత ఏర్పాట్లపై శాసనసభ మీటింగ్ హాల్లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమావేశాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సభ్యుల ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రులు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. అసెంబ్లీ కమిటీల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని, మండలి, శాసన సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించాలని ఆదేశించారు.
బడ్జెట్ సమావేశాల సమయంలో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మండలి షిఫ్టింగ్ పనులు త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సభ్యుల భద్రత, రక్షణ వ్యవహారాల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీల అనుమతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పోలీసులకు సూచించారు.
సభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కో ఆర్డినేట్ చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు సభ్యులకు అందించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. ఈ సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని, ఈ విషయంలో గతంలో తాను బాధితుడినన్న విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు. కొత్త సభ్యుల కోసం సమావేశాల తర్వాత రెండు రోజుల పాటు ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.